తిట్ల భూతం

తిట్ల భూతం

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నువ్వుదేన్ని సాధించగోరి, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో, ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక వత్తిళ్ళుకు గురై విసిగి వేశారి, చివరకు తాము సాధించదలచినదేమిటో కూడా మరిచిపోతూండడం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి, ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక, ఇతరుల మేలుకోసం కోరింది. నువ్వు అలాంటి పొరబాటు చేయకుండా వుండేందుకు ఆమెకధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్ప సాగాడు:

వీరమ్మ పరమగయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్ళిచేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచానపడివుంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారూ, మనశ్శాంతి లేక మామగారూ ఎంతోకాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ, భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకూ, కూతురూ పుట్టారు. వీరమ్మ వాళ్ళనూ సాధిస్తూండేది. కూతురు పెద్దదై పెళ్ళి చేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది.

భీముడు, వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడిలా వుంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా ఒంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు, తల్లికి మాత్రం భయపడేవాడు.

ఒకసారి భీముడు తల్లికోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టు చీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు. కొడుక్కురంగులు, చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా, తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీర కనబడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని, భీముడికి తెలుసు. అందుకని, ఏం చేయాలో తోచక, ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టుకింద దిగులుగా కూర్చున్నాడు.

ఆ సమయంలో కొందరాడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజూ ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలుచేసి, బిందెలతో నీళ్ళు తీసుకుని వెళతారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి, చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి, “ఎవరయ్యా, సిగ్గులేదూ, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు!” అని చీవాట్లు పెట్టింది.

భీముడు దీనంగా ముఖంపెట్టి, తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పికున్నాడు. అది వన్న అరుణ హేళనగా నవ్వి, “హా, గొప్ప తెలివైనదే, మీ అమ్మ! చీరల ఎంపికకు తను రావాలి; ఎవరైన ఆడవాళ్ళను పంపాలి. మగవాణ్ణి – అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా! సరేలే, నీకు నేను సాయపడతానుకానీ, నువ్వు ఇక్కణ్ణుంచి లేచి, ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్యగారిల్లెక్కడా అని అడిగి తెలుసుకుని, ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక, మీ అమ్మ బాగుబాగు అని మెచ్చే చీర, నీ చేత కొనిపిస్తాను,” అన్నది.

భీముడు అక్కడినుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి, సాంబయ్య ఇల్లు తెలుసుకుని, ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి, వాణ్ణి పలకరించి, వీరమ్మ చూపులకెలా వుంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని, ఒక నేతగాడి ఇంటికివెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది.

ఇలా పని ముగిశాక అరుణ, భీముడితో, “ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత, ఆమెతో – నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్ని విని, అచ్చం అలాంటి చీరే ఆరేళ్ళక్రితం ఈదేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులుగల మరొక స్త్రీ ఉన్నందుకు, అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా, అమ్మకు తృప్తి కలక్కపోతే – మహారాణి జాతకురాలికి, ఈ చీర నచ్చి తీరుతుందనీ, ఒక వేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయుండదనీ అన్నాడు నేతగాడని చెప్పు. నీకే ఇబ్బందీవుండదు,” అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది.

భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి, అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి, భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. “వాడు, తండ్రితో జరిగిందంతా చెప్పి, “అరుణ ఈ ఇంటికోడలైతే, అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా వుంది,” అన్నాడు. మర్నాడు వాడు పనిమీద పొరుగూరుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి, గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ, గబగబా వాడి దగ్గరకు వచ్చి, “మీ అమ్మ నిన్ను బాగా చీవాట్లు పెట్టిందా?” అంది, భీముడి మీద జాలిపడుతూ.

” లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను,” అన్నాడు భీముడు.దానికి అరుణ ఆశ్చర్యపోయి, ” ఏమిటా ముఖ్య విషయం?” అని అడిగింది. భీముడు కాస్త బెరుకు బెరుకుగా, “నిన్ను పెళ్ళాడాలని వుంది,” అన్నాడు. “నువ్వు నన్నడుగుతావేమిటి? మీ పెద్దలతో, మా పెద్దలను అడగమని చెప్పు,” అన్నది చిరాగ్గా అరుణ.

“పెద్దల సంగతి తర్వాత. నాకు నువ్వు నచ్చావు. నేను నీకు నచ్చానో లేదో తెలుసు కుందామనే, ఇప్పుడిలా వచ్చాను,” అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడి ముఖంకేసి చూసి, “నువ్వు అందంగా వున్నావు. మంచి వాడివి. నచ్చావుకాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను,” అంటూ సిగ్గుపడింది.అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, “నీ తెలివి తేటలతో, మా అమ్మను మార్చగలవా? బాగా ఆలోచించుకో!” అన్నాడు.

ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వమహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశసంచారం చేస్తూ, గంగవరం వచ్చి, కాలువ ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడతపడడంతో ఆయన లేవలేక అవస్థపడుతూంటే, స్నానానికి వచ్చిన ఆడపిల్లలు, ఆయన్ను అపహాస్యం చేయడమే కాక, తొందరగా అక్కణ్ణించి వెల్ళిపొమ్మని కేకలు వేశారు.
అరుణ వాళ్ళను మందలించి, బిల్వమహర్షికి తగిన శుశ్రూషచేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడాయన అరుణతో, “అమ్మాయీ, నీ సేవలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను!” అన్నాడు. అయితే, ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వమహర్షి సరేనని, “కళ్ళు మూసుకుని మూడుమార్లు నాపేరు తలచు కుంటే ప్రత్యక్షమై, నీకోరిక తీరుస్తాను,” అని వెల్ళిపోయాడు.

అరుణ ఇప్పుడు భీముడికి, బిల్వమహర్షి కధ చెప్పి, “మీ అమ్మను మార్చడం మామూలు మనుషులవల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. మనం బిల్వమహర్షి సాయం అర్ధిద్దాం!” అంటూ, ముమ్మూరు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వమహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకుని, భీముడితో, “పద నాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం,” అన్నాడు.

మహర్షి భీముడితో వాళ్ళ ఊరుచేరి, భీముడి ఇంట్లో ప్రవేశించి, మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, “అమ్మా, నాకు భిక్ష కావాలి!” అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చుని, “బిచ్చం కోసం వచ్చావు. మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా?” అంటూ మహర్షిని తిట్టడం మొదలు పెట్టింది.

“అమ్మా! ఇష్టముంటే బిచ్చం వెయ్యి; లేకుంటే పొమ్మని చెప్పు. నీ తిట్లు భూతమై నిన్నే బధిస్తాయి, “అన్నాడు బిల్వ మహర్షి. “తిట్టడం నాకు అలవాటు. అమ్మనాన్నలను తిట్టాను. నాకేమి కాలేదు. అత్తమామలను తిట్టాను, వాళ్ళే పోయారు. మొగుణ్ణీ, కొడుకునూ తిడుతున్నాను. చచ్చినట్టు పడుతున్నారు. నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు!” అన్నది వీరమ్మ నిరసనగా.

“నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది. అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడా తిట్టు నీ దగ్గరే వుండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్ధంకావడం కోసం, ఈ క్షణంలోనే — అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్టున్నాను,” అన్నాడు బిల్వమహర్షి.

అంతే! ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకరాకారంలో ఒక భూతం నిలబడి, ” అహొ, వీరమ్మా! నేను నీ తిట్లభూతాన్ని! ఇంకొక నాలుగేళ్ళ తర్వాత, నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను. కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే, భూత రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు. లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను,” అన్నది.

వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కు తోచక, మహర్షి కాళ్ళమీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, “భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటుమామిడి చెట్టుంది కదా! దాన్ని నాశనం చెయ్యమని చెప్పు. భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచి పెడుతుంది,” అన్నాడు. వీరమ్మ సరేననగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే, అక్కడ మామిడి చెట్టు లేదు.

అప్పుడు బిల్వమహర్షి ఎంతో శాంతంగా, “వీరమ్మా! నువ్వికనుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు. అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా వుంటే, నిన్నే భూతమూ బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి! నీ కొడుక్కు, గంగవరంలో వుండే అరుణ అనే అమ్మయితో పెళ్ళి చేయి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే, క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో. నీ కష్టసుఖాలిక నీలోనే వున్నాయి,” అని చెప్పి, బిల్వ మహర్షి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

తర్వాత కొద్దిరోజుల్లోనే భీముడికీ, అరుణకూ పెళ్ళయింది. భేతాళుడు ఈ కధ చెప్పి, “రాజా, బిల్వమహర్షి ఇచ్చిన వరాన్ని, అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనబడదు. ఆ వర ప్రభావంతో ఆమె, ఏ గొప్ప ధనవంతుడి ఇంటికోడలో అయి సర్వసుఖాలూ అనుభవించవచ్చు. ఆమె వరాన్ని, తనకోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలుకోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పాక పోయావో, నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెల్ళి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనేగదా కోరుకునేది! ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనబడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికొస్తే – సాధారణంగా మగవాళ్ళకు చిరాకెక్కువ. అలాంటప్పుడు, ఎన్నిమాటలన్నా నోరెత్తకుండా వుండే భీముడులాంటివాణ్ణి ఏ ఆడపిల్లయినా కోరుకుంటుంది. అట్లని, తిట్లభూతం శక్తి చూసిన అరుణ, భీముడిపట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏ మాత్రం లేదు. ఈ కారణాలవల్ల అరుణ, మహర్షి ఇచ్చిన వరాన్ని తనకూ, తన వాళ్ళకూ శుభంకలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల, అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు,” అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

-(కల్పితం)

[ఆధారం: “వసుంధర” రచన]

ప్రకటనలు

సత్యాన్వేషి

సత్యాన్వేషి
రచయిత: చందమామపట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి
శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా! ఏ లక్ష్యం సాధించాలని నువ్విలా శ్రమప
డుతున్నావో నాకు తెలియదు. లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకున్న వివేకులూ, తపస్సంపన్నులూ సైతం ఒక్కొక్కసారి అనాలోచితంగా క్షణికమైన నిర్ణయాల తో, తమ
జీవిత లక్ష్యాలకు దూరమై, అపమార్గం పాలవుతారు. నువ్వు అలాం టి పొరబాటు
చేయకుండా ఉండగలందులకు వీలుగా, నీకు శశాంకుడనే ఒక తపస్సంపన్నుడి కథ
చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పసాగాడు:

శశాంకుడు సువర్ణపురి రాజపురోహితుడి ఏకైక కుమారుడు. రాజు మార్తాండవ ర్మ
కుమారుడు స్వర్ణకీర్తి, శశాంకుడూ ఒకే ఈడు వాళ్ళు. పదహారవయేట వర కు ఒకే
గురుకులంలో విధ్యాభ్యాసం చేశారు. బాల్యం నుంచి మంచి మిత్రులు.

రాజు మార్తాండవర్మ తన కుమారుణ్ణి క్షాత్రవిద్యలు అభ్యసించడానికి
వింధ్యప ర్వత సానువులలో ఉన్న విష్ణుచంద్రుడి గురుకులానికి పంపాలని
నిర్ణయించా డు. అందువల్ల రాకుమారుడు స్వర్ణకీర్తి, తన మిత్రుణ్ణి వదిలి
వెళ్ళవలసి వచ్చింది.

శశాంకుడికి
చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విషయాలపట్ల ఒక విధమైన అనాసక్తత ఉండేది. అది
క్రమంగా విరక్తిగా పరిణమించింది. లౌకిక సుఖాలను త్యజించి, తపస్సు
చేయడానికి సమీప అరణ్యానికి వెళ్ళాడు. కొన్ని సంవత్స రాలపాటు కఠోర తపస్సు
చేశాడు. కొంతకాలానికి ఫలాలనూ, కందమూలా లనూ భుజించడం కూడా మాని వేశాడు.
కేవలం తులసీతీర్థంతోనే ప్రాణాలు నిలుపుకుంటూ, తపస్సు ద్వారా అనేక సిద్ధులు
సాధించాడు. నీళ్ళ మీద నడ వగలిగే వాడు. గాలిలో ఎగరగలిగేవాడు. అయినా
లౌకికశక్తులన్నీ కేవలం క్షణి కాలు; మరణాన్ని జయించే మహొన్నత స్థితిని
పొందాలి, అదే శాశ్వతమైనది అని భావించి తన కఠోర తపస్సును కొనసాగించాడు.

శశాంకుడు చేస్తూన్న తపస్సు గంధర్వలోకంలో కలవరం పుట్టించింది. శశాంకు డు
చేస్తూన్న కఠోర తపస్సును చూసి గంధర్వులు ఆశ్చర్యపోయారు. తన సింహాసనం
ఆక్రమించడానికే శశాంకుడు ఇలా కఠోర తపస్సు చేస్తున్నాడని అనుమానించి
గంధర్వరాజు భయకంపితుడయ్యాడు. శశాంకుడిచేత ఏదైనా పాపకార్యం చేయిస్తే ఆయన
తపోశక్తి నశించిపోగలదని ఆశించి, అందుకొక పథకం ఆలోచించాడు.

గంధర్వరాజు దైవజ్ఞుడి రూపంతో సువర్ణపురికి వెళ్ళి రాజును దర్శించి, “రాజా! తమ కుమారుడు స్వర్ణకీర్తికి ఈ భూప్రపంచానికే చక్రవర్తి అయ్యే యోగం
ఉన్నది. అయితే చిన్న అవరోధం ఏర్పడింది. దానిని తొలగించడం తండ్రిగా నీ
బాధ్యత కాదా?” అన్నాడు.

నా బాధ్యత నెరవేరుస్తాను. ఏమిటో సెలవివ్వండి స్వామీ,” అన్నాడు రాజు.

సర్వజీవకోటి యాగం చేయాలి. అంటే, మీ రాజ్యంలో వున్న జంతు
పక్షిజాతులన్నింటి లోనూ ఒక్కొక్క ప్రాణిని తెచ్చి యజ్ఞంలో బలి ఇవ్వాలి,” అన్నాడు దైవజ్ఞుడు.”అలాగే!” అన్నాడు రాజు. “అయితే ఒక్క విషయం!” అని ఆగాడు దైవజ్ఞుడు.ఏమిటి?” అని అడిగాడు రాజు. “జంతు వులను మామూలు మనిషి బలి ఇవ్వకూడ దు.
ఆకలి దప్పులను జయించిన తపోసంపన్నుడే ఆ పని చేయాలి. తులసి తిర్థంతోనే
ప్రాణాలు నిలుపుకున్న తపశ్శాలి అయితే మరీ ఉత్తమం!” అన్నాడు దైవజ్ఞుడు.అలాంటి తపోధనుడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు రాజు. “ప్రయత్నిస్తే ఫలితం
సిద్ధిస్తుంది! మనోరథ సిద్ధిరస్తు,” అని ఆశీర్వదించి దైవజ్ఞు డు అక్కడి
నుంచి వెళ్ళిపోయాడు.

తన కుమారుడు చక్రవర్తి కాగలడన్న ఊహ రాజు హృదయంలో ఆనందతరం గాలను
పుట్టించసాగింది. ఎలాగైనా యజ్ఞాన్ని చేసి తీరాలన్న నిర్ణయానికి వచ్చాడు.
రాజ్యంలోని జంతు పక్షిజాతులన్నింటిలోనూ ఒక్కొక్క దానిని యజ్ఞానికి సిద్ధం
చేయమని భటులను ఆజ్ఞాపించాడు. రాజ్య ప్రజల క్షేమం కోసం మునుపెవ్వరూ చేయని
సర్వజీవకోటి యజ్ఞం చేస్తున్నట్టు చాటింపు వేయించాడు. ఆ యజ్ఞాన్ని
జరిపించడానికి ఆకలిదప్పులు లేని తపోసంపన్ను డు కావాలనీ, అటువంటి మహనీయుడు
కంటబడితే తెలియజేయమనీ ప్రకటించాడు.

ఐదవరోజు ఒక బోయవాడు రాజదర్శనానికి వచ్చి, అడవిలో ఒక ముని తప స్సు చేస్తున్నాడని, ఆయన ఆహారం తీసుకోవడం తాను ఎన్నడూ చూడలేదనీ చెప్పాడు.

రాజు మంత్రిని పిలిచి, “తమరు వెంటనే వెళ్ళి, ఆ మునిని యజ్ఞ నిర్వహణకు
పిలుచుకురండి. ఆయన ఏది అడిగినా ఇవ్వడానికి వెనుకాడకండి,” అని ఆజ్ఞాపించాడు.

మంత్రి బోయవాడి వెంట అరణ్యానికి వెళ్ళి, శశాంకుణ్ణి కలుసుకుని సంగతి
వివరించి,” మహాత్మా, రాజ్యానికి అంతటికీ క్షేమం సమకూర్చే యజ్ఞం మీ
హస్తాలతో నిర్వహించాలి. ప్రత్యుపకారంగా మీరేం కోరినా ఇవ్వడానికి మహ రాజు
సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు, రాజు తమను తన ప్రధాన సలహా దారుగా
నియమిస్తారు. భావితరాలకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దడానికి వీలుగా మీకు
ఆశ్రమ సమీపంలోనే గురుకుల పాఠశాలను ఏర్పాటుచేయగలరు,” అన్నాడు. అయితే
శశాంకుడు అందుకు అంగీకరించక తల అడ్డంగా ఊపుతూ, “యజ్ఞంపేరుతో జంతువులను
వధించడం పాపం. అది నా సిద్ధాంతాలకు విరుద్ధం,” అన్నాడు.

రాజుగారు
తమకు ప్రశాంతమైన ఉద్యానవ నం మధ్య బ్రహ్మాండమైన భవనం నిర్మించి ఇవ్వగ లరు.
అందులో మీరు సకలవిధ సౌఖ్యాలనూ అనుభవించవచ్చు,” అన్నాడు మంత్రి. “అవన్నీ
మానవులు ఆశించతగ్గ గొప్ప సంపదలే కావచ్చు. నా లక్ష్యసాధనకు అరణ్యమే సానుకూల
ప్రదేశం,” అన్నాడు శశాంకుడు. మంత్రి మరేమి మాట్లాడలేక రాజ్యానికి
తిరిగివచ్చి, రాజుకు జరిగిన సంగతి చెప్పాడు. రాజు ఆవేశంతో, “ఆ తపస్వికి, నా కుమార్తెనిచ్చి వివాహం జరిపించి, నా రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పు,” అన్నాడు.

రాకుమారి భార్గవి తండ్రి మాటలు విని దిగ్భ్రాంతి చెందింది. కుమార్తె
భయాన్ని గ్రహించిన రాజు, “భయపడకు, మొదట యజ్ఞం పూర్తికానీ. ఆ తరవాత
జరగవలసినవన్నీ నేను చూసుకుంటాను,” అని ధైర్యం చెప్పాడు. మునిని
వంచించాలన్న తండ్రి కుతంత్రం నచ్చకపోయినప్పటికీ, ప్రజల క్షేమందృష్ట్యా
భార్గవి తండ్రి మాట కాదనలేక మౌనం వహించింది.

రాకుమారి మంత్రి వెంట అరణ్యానికి బయలుదేరింది. మంత్రి మునిని దర్శించి, “మహాత్మా! తమరు వచ్చి యజ్ఞం జరిపించినట్టయితే, మా రాకుమారి భార్గవి తమకు
అర్ధాంగి కాగలదు. రాజు మార్తాండవర్మ తదనంతరం తమరే సువర్ణపురాధీశులు
కాగలరు. ఇది మహారాజుగారి విన్నపం!” అన్నాడు.

శశాంకుడు యువరాణిని చూసి ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్థుడయ్యాడు.
అనిర్వచనీయమైన విచిత్ర అనుభూతికి లోనయ్యాడు. అంతవరకు ఉన్న జీవిత
లక్ష్యాన్ని మరిచిపోయి, “ఈ సౌందర్యరాశిని వివాహమాడి, రాజ్యానికి
రాజునవుతాను. సరే.. అలాగే,” అన్నాడు. మంత్రి తెచ్చిన బంగారు రథం ఎక్కి
రాజధానికి చేరుకున్నాడు.

యజ్ఞవాటిక సిద్ధమయింది. వేలాది జంతువులు, పక్షులు విశాలమైన మైదానంలోకి
చేర్చబడ్డాయి. రాజూ, మంత్రీ వెంటరాగా శశాంకుడు చేతిలో ఖడ్గం ధరించి
యజ్ఞకుండాన్ని సమీపించాడు. యజ్ఞకుండానికి పక్కన బలికి సిద్ధంగా ఒక ఏనుగును
నిలబెట్టారు. ప్రథమ బలిగా ఏనుగును నరకడానికి శశాంకుడు ఖడ్గాన్ని
పైకెత్తాడు. జరగనున్న దారుణాన్ని గ్రహించి ఏనుగు భయంతో తొండమెత్తి
ఘీంకరించింది. మరుక్షణమే అక్కడ చేరిన జంతువు లన్నీ ఒక్కసారిగా దిక్కులు
పిక్కటిల్లే విధంగా దీనంగా విలపించాయి. శశాంకుడు ఉలిక్కిపడి ఒకసారి
చుట్టుపక్కల కలయచూసి, చేతిలోని ఖడ్గంతో తన శిరస్సు యజ్ఞకుండలో పడేలా
ఖండించుకున్నాడు.


బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా! శశాంకుడు రాకుమారి అద్భుత సౌందర్యానికి
ముగ్ధుడై, రాజ్యకాంక్షతో జంతుబలి ఇవ్వడానికి అంగీకరించాడు కదా? మరి, జంతువులకు బదులు తన శిరస్సునే ఖండించుకున్న ఆయన విపరీత చర్యకు కారణం
ఏమిటి? జంతువులన్నిటినీ ఒకే చోట ఒక్కసారిగా చూడడంతో భయబ్రాంతుడై చిత్త
చాంచల్యానికి లోనయ్యాడా? లేక రాజు మనోగతాన్ని గ్రహించి యజ్ఞం కాగానే తనను
మోసగించగలడని ఊహించి, ఆశాభంగంతో ఈ దారుణానికి పూనుకున్నాడా? శశాంకుడి
దారుణ చర్యకు అసలు కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా
చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “శశాంకుడు శిరస్సు ఖండించుకోవడానికి కారణం ఆయన
భయభ్రాంతుడు కావడమో, చిత్తచాంచల్యానికి లోనుకావడమో, ఆశాభంగానికి
గురికావడమో కాదు. శశాంకుడు ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి లేని
సత్యాన్వేషి అన్న సంగతి మరిచిపోకూడదు. అటువంటి విరాగి రాకుమారిని చూడగానే
విచిత్రమైన అనుభూతికిలోనై, రాజ్యకాంక్షతో మంత్రి వెంట బయలుదేరాడు. అది
గంధర్వుల మాయాజాలం! అంటే గంధర్వులు ఆయన మనసులో భ్రమను కల్పించారు. ఏనుగు
ఘీంకారం; జంతువుల, పక్షుల దీనాలాపనలు మంచు తెరలాంటి ఆ భ్రమను తొలిగించాయి.
ఆ క్షణమే ఆయన తన తప్పును గ్రహించాడు. ఇన్ని అమాయక ప్రాణులను బలి ఇవ్వడా
నికి అంగీకరించిన పాతకానికి ఈ జన్మలో నిష్కృతి లేదని భావించాడు. ప్రాయ
శ్చితంగా శిరస్సును ఖండించుకుని మునుముందైన పరిణితి చెందిన మానవు డిగా
జన్మించి, తన లక్ష్యాన్ని సాధించుకోవచ్చునన్న ఆశయంతోనే ఆ చర్యకు
ఒడిగట్టాడు!” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతోసహా మాయ మై, తిరిగి చెట్టెక్కాడు. -(కల్పితం)

జయంతుడి వైద్యం

బేతాళ కధలు
జయంతుడి వైద్యం

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి
శవాన్నిదించి భుజాన వేసుకుని,ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు,”రాజా,ఏ న్యాయాన్ని రక్షించడం కోసం నువ్వు ఇలా
శ్రమపడుతున్నావో తెలియదు.శాంతి భద్రతల పరిరక్షణలో న్యాయాధికారుల.పాత్ర
కీలకమైనది.పరోపకారపరాయణులూ స్వపర భేదాలు పాటించనివారూ అని ప్రజల మన్ననలు
పొందిన న్యాయాధికారులు సైతం ఒక్కొక్కసారి నిర్హేతుకంగా నిరపరాధులను
శిక్షిస్తూ ఉంటారు.అలంటి వారిపట్ల పాలకులు అప్రమత్తులై ఉండడం అవసరం. నీకు
తగు హెచ్చరికగా ఉండేందుకు, స్వయంగా

దోషి
నేరాన్ని అంగీకరించినప్పటికీ,నిర్దోషిని బందీగా చేసిన సత్యదీపుడనే
న్యాయాధికారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా,విను,” అంటూ ఇలా చెప్పసాగాడు:చక్రపురంలో
ఉండే రమాకాంతుడనే భాగ్యవంతుడికి లేకలేక కలిగిన బిడ్డ
జయంతుడు.తల్లిదండ్రులు మితిమించిన గారాబం చెయ్యడం వల్ల అతడు విలాస
జీవితానికి అలవాటు పడ్డాడు. అది తగదని పెద్దలు ఎంతచెప్పినా పట్టించుకోని
జయంతుడికి పాతికేళ్ళ వయసు వచ్చేసరికి ఉన్నట్టుండి చర్మం ముడతలు పడి,
జుట్టు తెల్లబడసాగింది. తల్లిదండ్రులు కంగారుపడి అతన్ని వైద్యులకు
చూపించారు. వైదులు అతన్ని పరీక్షించి,”ఈ జబ్బేమిటో మాకు అంతుబట్టడం
లేదు.కాబట్టి దీనికి వైద్యమూ మాకు తెలియదు,” అన్నారు.
ఇలా ఉండగా ఆ
ఊరికి గురుపాదుడనే ముని వచ్చాడు. చాలా మంది ఆయనకు తమ సమస్యలు చెప్పుకుని
పరిష్కారం తెలుసుకుంటున్నారు. రమాకాంతుడు కూడా జయంతుణ్ణి ఆయనవద్దకు తీసుకు
వెళ్ళాడు. అప్పటికి జయంతుడు మరో మనిషి సాయంలేనిదే నడవలేని స్థితిలో
ఉన్నాడు.గురుపాదుడతడి అవస్థకు జాలిపడి,”నేను ఒక మంత్రం
ఉపదేశిస్తాను.నువ్వు సమీపారణ్యానికి వెళ్ళి, ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు
చేస్తే, అశ్వనీ దేవతలు ప్రత్యక్షమై నీకు వైద్యశాస్త్రంలోని మర్మాలు
చెబుతారు. వాటి సాయంతో నీ జబ్బు నయం చేసుకో. ఆ తరవాత వైద్య వృత్తిని
స్వీకరించి పరోపకారం చెయ్యి,” అంటూ అతడికి మంత్రోపదేశం చేశాడు.

ప్రకారం జయంతుడు సమీరుడనే పనివాణ్ణి వెంటబెట్టుకుని సమీపారణ్యం మధ్యలోకి
వెళ్ళాడు. వాడు యజమాని అవసరాలు చూస్తూ, సేవలు చేస్తూ ఉంటే, జయంతుడు ముని
ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, శ్రద్ధగా తపస్సు చేయసాగాడు. అలా ఆరు
మాసాలు గడిచాయి.

ఒక రోజున అశ్వనీ దేవతలు ప్రత్యక్షమై, ఒక తాళ పత్ర
గ్రంథం ప్రసాదించి, “నీ తపస్సుకు మెచ్చి మేము ఇస్తూన్న వైద్య గ్రంథం ఇది.
దీన్ని చదివితే నీ జబ్బులేకాక, ఎన్నో విపరీతరోగాలకు చికిత్సా విధానం
తెలుస్తుంది. నిజం చెప్పిన వారికీ, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడిన వారికి
మాత్రమే ఈ మాత్రమే ఈ మందులు పని చేస్తాయి. చికిత్స ప్రారం

భిస్తే
మూడు మాసాల్లో మామూలు మనిషివవుతావు. అయితే,అంతవరకు నువ్వు నీ
తల్లిదండ్రులను కానీ, తెలిసిన వాళ్ళను కానీ కలుసుకోకూడదు,” అని చెప్పి
అదృశ్యులయ్యారు.

జయంతుడు ఆ వైద్య గ్రంథాన్ని చదివి, తన కవసరమైన
చికిత్సా విధానం తెలుసుకున్నాడు. సమీరుడికి చెప్పి వనమూలికలు తెప్పించి,
వాడిచేత తనకు మూడు మాసాలకు సరిపడేలా గుళికలు తయారు చేయించి క్రమం
తప్పకుండా వాడసాగాడు.

ఒకనాడు అడవిలో కందమూలాలు సేకరిస్తూన్న
సమీరుణ్ణి పలకరించిన ఒక దృఢకాయుడు, “నన్ను క్షేమంగా చక్రపురం
చేరిస్తే,నూరు వరహాలిస్తాను,” అన్నాడు.

భుజానికి సంచీని
తగిలించుకుని ఉన్న అతన్ని, “ఇంత దూరం వచ్చిన వాడివి,మరి కొంత దూరం
వెళ్ళలేవా? అడవి దాటడనికి నీకు మనిషి సాయం ఎందుకు?” అని అడిగాడు
సమీరుడు.”హఠాత్తుగా నా కంటి చూపు మందగించింది” అన్నాడు అతడు.

“అలా అయితే, నువ్వు నాతోరా. నా యజమాని ఏ జబ్బునైనా నయంచేయగలడు,” అంటూ సమీరుడు అతన్ని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు.
జయంతుడు
అతడి జబ్బు గురించి తెలుసుకుని,” ఒక్క గుళికతో నీ జబ్బు నయమవుతుంది. కానీ,
అంతకు ముందు నువ్వు నాకు నీ గురించిన నిజం చెప్పాలి. ఇంతవరకూ చేసిన
తప్పులకూ పశ్చాత్తాపపడాలి,” అన్నాడు.
అతడు తన గురించి చెప్పాడు: అతడి
పేరు ప్రతీకుడు. అడవికి ఆవలి వైపున ఉన్న సత్యపురమనే నగరంలో ఉంటూన్న దొంగ.
పట్టుబడకపోవడంవల్ల పెద్దమనిషిగా చెలామణి అవుతూన్న అతడికి ఒక పేద రైతు తన
కూతురు గౌరినిచ్చి పెళ్ళి చేశాడు.పెళ్ళయ్యాక భర్త దొంగ అని తెలుసుకున్న
గౌరి, అతన్ని గట్టిగా మందలించింది. దొంగతనం చేస్తే ఎదో ఒక రోజున పట్టుబడక
తప్పదనీ, అప్పుడు తన కుటుంబం కష్టాల పాలవుతుందనీ గ్రహించిన ప్రతీకుడు,
భార్యమాటలకు వివేకం తెచ్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అందులో
సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది. ఆ
సమయంలో ప్రతీకుడికి ఒకనాడు ఉన్నట్టుండి కళ్ళు మసకబారినట్టు తోచి వైద్యుడి
వద్దకు వెళ్ళాడు. ఆయన అతన్ని
పరీక్షించి కొన్ని గుళికలిచ్చి, “ఇవి వేసుకుంటే ఇప్పటికి నీ కంటి చూపు
మెరుగవుతుంది. ఐతే, కొన్నాళ్ళలో నీకు చూపు పూర్తిగా పోవచ్చు. దాన్ని ఆపగల
మందులు నాకు తెలియవు. కాబట్టి సంపాదన విషయంలో ఈలోగా జాగ్రత్తపడు,” అన్నాడు.
ప్రతీకుడు
విషయం భార్యకు చెబితే,”ఇన్నాళ్ళు, నీ సంపాదనతో గౌరవంగా బతికాం.త్వరగా
డబ్బు కూడబెట్టలంటే, నీ కంటి చూపు పోయేలోగా నువ్వు వీలైనన్ని దొంగతనాలు
చేయక తప్పదు,” అన్నది ఆమె.
భవిష్యత్తు మీది భయంకొద్దీ, ప్రతీకుడు మళ్ళి దొంగతనాలు మొదలు పెట్టాడు. వారం రోజుల్లోనే నగలూ, డబ్బూ దొరికాయి.
సత్యపురంలో
దొంగతనాలెక్కువైనట్టు నగర రక్షణాధికారీ, న్యాయాధికారీ అయిన సత్యదీపుడికి
ఫిర్యాదు అందింది. కాపలా భటుల సంఖ్య పెంచినా దొంగతనాలు తగ్గలేదు. ఊళ్ళో
పెద్దమనిషిగా చెలామణీ అవుతూన్న వ్యక్తి, ఈ దొంగతనాలు చేస్తున్నాడని
సత్యదీపుడికి అనుమానం కలిగింది. అందుకని ఆయన త్వరలో పెద్దమనుషుల ఇళ్ళన్నీ
తణిఖీ చేయిస్తానని నగరంలో చాటింపు వేయించాడు. సత్యదీపుడికి నీతిమంతుడు,
పరోపకారి, న్యాయవిచారణలో స్వపర భేదం పాటించడు అని నగరంలో పేరుంది.
ఇది
విన్న ప్రతీకుడికి దోచిన నగలు తమ ఇంట్లో ఉండడం ప్రమాదం అనిపించింది. భార్య
సలహా మీద అతడు వాటినన్నింటినీ మూటగట్టుకుని అడవి మార్గాన చక్రపురికి
బయలుదేరాడు. వాటినక్కడ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చుకుంటే తమకు ఇబ్బంది
ఉండదని అతడు అనుకున్నాడు. అడవిలో సగం దూరం వెళ్ళేసరికి, ప్రతీకుడికి చూపు
మందగించసాగింది. అప్పుడే సమీరుణ్ణి చూశాడు.
ఇంతవరకు చెప్పిన ప్రతీకుడు, “నా కంటిచూపు బాగుపడితే, జీవితంలో మళ్ళీ దొంగతనం చెయ్యను,” అన్నాడు.
తరవాత
జయంతుడిచ్చిన ఒక్క గుళికతో ప్రతీకుడికి కంటి చూపు బాగుపడింది. అతడు
జయంతుడికి పాదాభివందనం చేసి, “అయ్యా, తమరు దైవాంశ సంభూతులు. నేను
సత్యపురానికి తిరిగి వెళ్ళి, నా తప్పు ఒప్పుకుని ఈ దొంగసొమ్మును ఎవరిది
వారికి అందజేస్తాను. అంతకు ముందు,చక్రపురంలో చావుబతుకుల్లో ఉన్న నా
పెదనాన్న నన్ను చూడాలని కబురు చేశాడు. వెళ్ళి ఆయన్ను చూసివస్తాను. నేను
తిరిగి వచ్చేంతవరకు ఈ నగలను తమ దగ్గరే ఉంచండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను,” అని చెప్పి నగలను జయంతుడికి అప్పగించి, చక్రపురానికి బయలుదేరాడు.

ఈలోగా
సత్యపురంలో తమ ఇళ్ళను పరిశోధించడం ఇష్టం లేని పెద్దమనుషులు కొందరు, అసలు
దొంగలు అడవిలో ఉన్నారని పుకారు పుట్టించారు. దాంతో సత్యదీపుడు
ఊళ్ళోవెతికించడం వాయిదా వేసి, కొందరు భటుల సాయంతో అడవిలో ప్రవేశించాడు.
అక్కడ వారికి జయంతుడి ఆశ్రమంలో నగలు దొరికాయి.

జయంతుడు,
సత్యదీపుడికి తన వద్దకు ఆ నగలు ఎల వచ్చాయో వివరించి, తన జబ్బు గురించీ,
అశ్వనీ దేవతల అనుగ్రహంతో తనకు లభించిన వైద్యగ్రంథం గురించీ చెప్పడు. ఐతే,
ఎంత అడిగినా ప్రతీకుడి పేరుగానీ, అతడి జబ్బేమిటోగానీ చెప్పలేదు.

సత్యదీపుడు
అతడి మాటలు నమ్మశక్యంగా లేవని అతన్నీ, సమీరుణ్ణీ బందీలుగా సత్యపురం
తీసుకువెళ్ళి, ఇద్దరినీ ఒకే కారాగారంలో ఉంచి, అక్కడ వారికి కావలసిన
సదుపాయాలు చేయించాడు.

ఆ తరవాత ఆయన జయంతుడి కథ చాటింపు
వేయించి,”చిరకాలంగా అంతుబట్టని రోగాలతో బాధపడుతున్న వారందరూ కారాగారానికి
వచ్చి, వైద్యం చేయించుకోవచ్చు,” అని ప్రకటించాడు.

అది విన్న కొందరు
రోగులు తమ నేరాలు బయటపడినా ఫరవాలేదని తెగించి కారాగారానికి వెళితే,
జయంతుడు వారి రోగాలు నయం చేశాడు. మరో విశేషం ఏమంటే, అతడు తను విన్న నేర
రహస్యాలను ఇతరులకు తెలియనివ్వలేదు.దాంతో చాలా మంది చికిత్సకు రాసాగారు.
ఈలోగా
చక్రపురం నుంచి తిరిగివచ్చిన ప్రతీకుడు సత్యదీపుణ్ణి కలుసుకుని, నేరం
ఒప్పుకుని, తనను బంధించి జయంతుణ్ణి విడిచిపెట్టమని వేడుకున్నాడు.
అయితే,
సత్యదీపుడు,” నువ్విలా వచ్చావంటే నీలో నిజంగానే మార్పు వచ్చిందని
అర్థం.కాబట్టి నిన్ను బంధించను. అయితే జయంతుణ్ణి మాత్రం మరి కొన్నాళ్ళు
ఇక్కడే బందీగా ఉంచక తప్పదు,” అన్నాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి,” రాజా,
అసలు దొషి అని తెలిసీ ప్రతీకుణ్ణి శిక్షించక వదిలి పెట్టడం; నిర్దోషి అని
తెలిసి కూడ జయంతుణ్ణి కారాగారంలో బంధించడం న్యాయాధి

కారి
సత్యదీపుడి విచక్షణా రాహిత్యాన్నీ, క్రూర స్వభావాన్నీ చాటుతున్నాయి కదా?
అలాంటి న్యాయాధికారిని పరోపకారి అని కొనియాడడం ప్రజల అఙ్ఞానం కాక మరేమిటి?
ఈ సందేహాలకు సమధానం తెలిసి కూడ చెప్పక పోయావో, నీ తల పగిలిపోతుంది,”
అన్నాడు.
దానికి విక్రమార్కుడు,”దోషులను కారాగారంలో బంధించడం, వారిలో
మంచిమార్పు తీసుకురావడానికే. అప్పటికే మంచివాడుగా మారిపోయిన ప్రతీకుణ్ణి
మళ్ళీ కారాగారానికి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఒరగదు. అందువల్లనే
న్యాయాధికారి అతన్ని వదిలిపెట్టాడు.ఇక జయంతుడి విషయం . అతడి పట్ల
న్యాయాధికారి క్రూరంగా వ్యవహరించలేదు సరికదా, గౌరవించి ఉపకారం చేశాడు.
పేరుకు కారాగారంలో బంధించినా, సమీరుణ్ణీ తోడుగా ఉంచి సకల సదుపాయాలూ
సమకూర్చాడు. జయంతుడి అపూర్వ వైద్యం గురించి చాటింపు వేయించాడు. జయంతుడి
వైద్యం కావాలంటే నేరస్థులు నేరం ఒప్పుకోవాలి.

అతడి వద్ద నేరాలు
ఒప్పుకున్నవాళ్ళ నేరాల గురించి, అతడికి తప్ప, మరెవ్వరికీ తెలియదు. వాళ్ళు
మళ్ళీ నేరాలు చేయరు. అటు నేరస్థులనిపించుకోకుండా, ఇటు శిక్షపడకుండా
నేరస్థుల్ని సంస్కరించే జయంతుడు కొన్నాళ్ళయినా సత్యపురానికి ఉపయోగపడాలనే,
న్యాయాధికారి అతన్ని బందీ చేశాడు. మరొక ముఖ్య విషయం ఏమంటే-తన జబ్బు
పూర్తిగా నయమయ్యేంత వరకు జయంతుడు తనవాళ్ళ మధ్య ఉండకూడదు అన్న నిబంధన
భంగమవకుండా అంతవరకు అతన్ని సత్యపురంలో ఉంచాలన్న సదుద్దేశంతొనే అతన్ని
బందీగా ఉంచాడు. అలా చేయడం ద్వారా రెండు మహత్తర ప్రయోజనాలను సాధించాడు. ఈ
కారణాల వల్ల ప్రజలు సత్యదీపుణ్ణి పరోపకారి అని కీర్తించడం అన్ని విధాలా
సమంజసమైనదే,” అన్నాడు.

రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెటెక్కాడు.