జయంతుడి వైద్యం

బేతాళ కధలు
జయంతుడి వైద్యం

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి
శవాన్నిదించి భుజాన వేసుకుని,ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు,”రాజా,ఏ న్యాయాన్ని రక్షించడం కోసం నువ్వు ఇలా
శ్రమపడుతున్నావో తెలియదు.శాంతి భద్రతల పరిరక్షణలో న్యాయాధికారుల.పాత్ర
కీలకమైనది.పరోపకారపరాయణులూ స్వపర భేదాలు పాటించనివారూ అని ప్రజల మన్ననలు
పొందిన న్యాయాధికారులు సైతం ఒక్కొక్కసారి నిర్హేతుకంగా నిరపరాధులను
శిక్షిస్తూ ఉంటారు.అలంటి వారిపట్ల పాలకులు అప్రమత్తులై ఉండడం అవసరం. నీకు
తగు హెచ్చరికగా ఉండేందుకు, స్వయంగా

దోషి
నేరాన్ని అంగీకరించినప్పటికీ,నిర్దోషిని బందీగా చేసిన సత్యదీపుడనే
న్యాయాధికారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా,విను,” అంటూ ఇలా చెప్పసాగాడు:చక్రపురంలో
ఉండే రమాకాంతుడనే భాగ్యవంతుడికి లేకలేక కలిగిన బిడ్డ
జయంతుడు.తల్లిదండ్రులు మితిమించిన గారాబం చెయ్యడం వల్ల అతడు విలాస
జీవితానికి అలవాటు పడ్డాడు. అది తగదని పెద్దలు ఎంతచెప్పినా పట్టించుకోని
జయంతుడికి పాతికేళ్ళ వయసు వచ్చేసరికి ఉన్నట్టుండి చర్మం ముడతలు పడి,
జుట్టు తెల్లబడసాగింది. తల్లిదండ్రులు కంగారుపడి అతన్ని వైద్యులకు
చూపించారు. వైదులు అతన్ని పరీక్షించి,”ఈ జబ్బేమిటో మాకు అంతుబట్టడం
లేదు.కాబట్టి దీనికి వైద్యమూ మాకు తెలియదు,” అన్నారు.
ఇలా ఉండగా ఆ
ఊరికి గురుపాదుడనే ముని వచ్చాడు. చాలా మంది ఆయనకు తమ సమస్యలు చెప్పుకుని
పరిష్కారం తెలుసుకుంటున్నారు. రమాకాంతుడు కూడా జయంతుణ్ణి ఆయనవద్దకు తీసుకు
వెళ్ళాడు. అప్పటికి జయంతుడు మరో మనిషి సాయంలేనిదే నడవలేని స్థితిలో
ఉన్నాడు.గురుపాదుడతడి అవస్థకు జాలిపడి,”నేను ఒక మంత్రం
ఉపదేశిస్తాను.నువ్వు సమీపారణ్యానికి వెళ్ళి, ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు
చేస్తే, అశ్వనీ దేవతలు ప్రత్యక్షమై నీకు వైద్యశాస్త్రంలోని మర్మాలు
చెబుతారు. వాటి సాయంతో నీ జబ్బు నయం చేసుకో. ఆ తరవాత వైద్య వృత్తిని
స్వీకరించి పరోపకారం చెయ్యి,” అంటూ అతడికి మంత్రోపదేశం చేశాడు.

ప్రకారం జయంతుడు సమీరుడనే పనివాణ్ణి వెంటబెట్టుకుని సమీపారణ్యం మధ్యలోకి
వెళ్ళాడు. వాడు యజమాని అవసరాలు చూస్తూ, సేవలు చేస్తూ ఉంటే, జయంతుడు ముని
ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, శ్రద్ధగా తపస్సు చేయసాగాడు. అలా ఆరు
మాసాలు గడిచాయి.

ఒక రోజున అశ్వనీ దేవతలు ప్రత్యక్షమై, ఒక తాళ పత్ర
గ్రంథం ప్రసాదించి, “నీ తపస్సుకు మెచ్చి మేము ఇస్తూన్న వైద్య గ్రంథం ఇది.
దీన్ని చదివితే నీ జబ్బులేకాక, ఎన్నో విపరీతరోగాలకు చికిత్సా విధానం
తెలుస్తుంది. నిజం చెప్పిన వారికీ, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడిన వారికి
మాత్రమే ఈ మాత్రమే ఈ మందులు పని చేస్తాయి. చికిత్స ప్రారం

భిస్తే
మూడు మాసాల్లో మామూలు మనిషివవుతావు. అయితే,అంతవరకు నువ్వు నీ
తల్లిదండ్రులను కానీ, తెలిసిన వాళ్ళను కానీ కలుసుకోకూడదు,” అని చెప్పి
అదృశ్యులయ్యారు.

జయంతుడు ఆ వైద్య గ్రంథాన్ని చదివి, తన కవసరమైన
చికిత్సా విధానం తెలుసుకున్నాడు. సమీరుడికి చెప్పి వనమూలికలు తెప్పించి,
వాడిచేత తనకు మూడు మాసాలకు సరిపడేలా గుళికలు తయారు చేయించి క్రమం
తప్పకుండా వాడసాగాడు.

ఒకనాడు అడవిలో కందమూలాలు సేకరిస్తూన్న
సమీరుణ్ణి పలకరించిన ఒక దృఢకాయుడు, “నన్ను క్షేమంగా చక్రపురం
చేరిస్తే,నూరు వరహాలిస్తాను,” అన్నాడు.

భుజానికి సంచీని
తగిలించుకుని ఉన్న అతన్ని, “ఇంత దూరం వచ్చిన వాడివి,మరి కొంత దూరం
వెళ్ళలేవా? అడవి దాటడనికి నీకు మనిషి సాయం ఎందుకు?” అని అడిగాడు
సమీరుడు.”హఠాత్తుగా నా కంటి చూపు మందగించింది” అన్నాడు అతడు.

“అలా అయితే, నువ్వు నాతోరా. నా యజమాని ఏ జబ్బునైనా నయంచేయగలడు,” అంటూ సమీరుడు అతన్ని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు.
జయంతుడు
అతడి జబ్బు గురించి తెలుసుకుని,” ఒక్క గుళికతో నీ జబ్బు నయమవుతుంది. కానీ,
అంతకు ముందు నువ్వు నాకు నీ గురించిన నిజం చెప్పాలి. ఇంతవరకూ చేసిన
తప్పులకూ పశ్చాత్తాపపడాలి,” అన్నాడు.
అతడు తన గురించి చెప్పాడు: అతడి
పేరు ప్రతీకుడు. అడవికి ఆవలి వైపున ఉన్న సత్యపురమనే నగరంలో ఉంటూన్న దొంగ.
పట్టుబడకపోవడంవల్ల పెద్దమనిషిగా చెలామణి అవుతూన్న అతడికి ఒక పేద రైతు తన
కూతురు గౌరినిచ్చి పెళ్ళి చేశాడు.పెళ్ళయ్యాక భర్త దొంగ అని తెలుసుకున్న
గౌరి, అతన్ని గట్టిగా మందలించింది. దొంగతనం చేస్తే ఎదో ఒక రోజున పట్టుబడక
తప్పదనీ, అప్పుడు తన కుటుంబం కష్టాల పాలవుతుందనీ గ్రహించిన ప్రతీకుడు,
భార్యమాటలకు వివేకం తెచ్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అందులో
సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది. ఆ
సమయంలో ప్రతీకుడికి ఒకనాడు ఉన్నట్టుండి కళ్ళు మసకబారినట్టు తోచి వైద్యుడి
వద్దకు వెళ్ళాడు. ఆయన అతన్ని
పరీక్షించి కొన్ని గుళికలిచ్చి, “ఇవి వేసుకుంటే ఇప్పటికి నీ కంటి చూపు
మెరుగవుతుంది. ఐతే, కొన్నాళ్ళలో నీకు చూపు పూర్తిగా పోవచ్చు. దాన్ని ఆపగల
మందులు నాకు తెలియవు. కాబట్టి సంపాదన విషయంలో ఈలోగా జాగ్రత్తపడు,” అన్నాడు.
ప్రతీకుడు
విషయం భార్యకు చెబితే,”ఇన్నాళ్ళు, నీ సంపాదనతో గౌరవంగా బతికాం.త్వరగా
డబ్బు కూడబెట్టలంటే, నీ కంటి చూపు పోయేలోగా నువ్వు వీలైనన్ని దొంగతనాలు
చేయక తప్పదు,” అన్నది ఆమె.
భవిష్యత్తు మీది భయంకొద్దీ, ప్రతీకుడు మళ్ళి దొంగతనాలు మొదలు పెట్టాడు. వారం రోజుల్లోనే నగలూ, డబ్బూ దొరికాయి.
సత్యపురంలో
దొంగతనాలెక్కువైనట్టు నగర రక్షణాధికారీ, న్యాయాధికారీ అయిన సత్యదీపుడికి
ఫిర్యాదు అందింది. కాపలా భటుల సంఖ్య పెంచినా దొంగతనాలు తగ్గలేదు. ఊళ్ళో
పెద్దమనిషిగా చెలామణీ అవుతూన్న వ్యక్తి, ఈ దొంగతనాలు చేస్తున్నాడని
సత్యదీపుడికి అనుమానం కలిగింది. అందుకని ఆయన త్వరలో పెద్దమనుషుల ఇళ్ళన్నీ
తణిఖీ చేయిస్తానని నగరంలో చాటింపు వేయించాడు. సత్యదీపుడికి నీతిమంతుడు,
పరోపకారి, న్యాయవిచారణలో స్వపర భేదం పాటించడు అని నగరంలో పేరుంది.
ఇది
విన్న ప్రతీకుడికి దోచిన నగలు తమ ఇంట్లో ఉండడం ప్రమాదం అనిపించింది. భార్య
సలహా మీద అతడు వాటినన్నింటినీ మూటగట్టుకుని అడవి మార్గాన చక్రపురికి
బయలుదేరాడు. వాటినక్కడ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చుకుంటే తమకు ఇబ్బంది
ఉండదని అతడు అనుకున్నాడు. అడవిలో సగం దూరం వెళ్ళేసరికి, ప్రతీకుడికి చూపు
మందగించసాగింది. అప్పుడే సమీరుణ్ణి చూశాడు.
ఇంతవరకు చెప్పిన ప్రతీకుడు, “నా కంటిచూపు బాగుపడితే, జీవితంలో మళ్ళీ దొంగతనం చెయ్యను,” అన్నాడు.
తరవాత
జయంతుడిచ్చిన ఒక్క గుళికతో ప్రతీకుడికి కంటి చూపు బాగుపడింది. అతడు
జయంతుడికి పాదాభివందనం చేసి, “అయ్యా, తమరు దైవాంశ సంభూతులు. నేను
సత్యపురానికి తిరిగి వెళ్ళి, నా తప్పు ఒప్పుకుని ఈ దొంగసొమ్మును ఎవరిది
వారికి అందజేస్తాను. అంతకు ముందు,చక్రపురంలో చావుబతుకుల్లో ఉన్న నా
పెదనాన్న నన్ను చూడాలని కబురు చేశాడు. వెళ్ళి ఆయన్ను చూసివస్తాను. నేను
తిరిగి వచ్చేంతవరకు ఈ నగలను తమ దగ్గరే ఉంచండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను,” అని చెప్పి నగలను జయంతుడికి అప్పగించి, చక్రపురానికి బయలుదేరాడు.

ఈలోగా
సత్యపురంలో తమ ఇళ్ళను పరిశోధించడం ఇష్టం లేని పెద్దమనుషులు కొందరు, అసలు
దొంగలు అడవిలో ఉన్నారని పుకారు పుట్టించారు. దాంతో సత్యదీపుడు
ఊళ్ళోవెతికించడం వాయిదా వేసి, కొందరు భటుల సాయంతో అడవిలో ప్రవేశించాడు.
అక్కడ వారికి జయంతుడి ఆశ్రమంలో నగలు దొరికాయి.

జయంతుడు,
సత్యదీపుడికి తన వద్దకు ఆ నగలు ఎల వచ్చాయో వివరించి, తన జబ్బు గురించీ,
అశ్వనీ దేవతల అనుగ్రహంతో తనకు లభించిన వైద్యగ్రంథం గురించీ చెప్పడు. ఐతే,
ఎంత అడిగినా ప్రతీకుడి పేరుగానీ, అతడి జబ్బేమిటోగానీ చెప్పలేదు.

సత్యదీపుడు
అతడి మాటలు నమ్మశక్యంగా లేవని అతన్నీ, సమీరుణ్ణీ బందీలుగా సత్యపురం
తీసుకువెళ్ళి, ఇద్దరినీ ఒకే కారాగారంలో ఉంచి, అక్కడ వారికి కావలసిన
సదుపాయాలు చేయించాడు.

ఆ తరవాత ఆయన జయంతుడి కథ చాటింపు
వేయించి,”చిరకాలంగా అంతుబట్టని రోగాలతో బాధపడుతున్న వారందరూ కారాగారానికి
వచ్చి, వైద్యం చేయించుకోవచ్చు,” అని ప్రకటించాడు.

అది విన్న కొందరు
రోగులు తమ నేరాలు బయటపడినా ఫరవాలేదని తెగించి కారాగారానికి వెళితే,
జయంతుడు వారి రోగాలు నయం చేశాడు. మరో విశేషం ఏమంటే, అతడు తను విన్న నేర
రహస్యాలను ఇతరులకు తెలియనివ్వలేదు.దాంతో చాలా మంది చికిత్సకు రాసాగారు.
ఈలోగా
చక్రపురం నుంచి తిరిగివచ్చిన ప్రతీకుడు సత్యదీపుణ్ణి కలుసుకుని, నేరం
ఒప్పుకుని, తనను బంధించి జయంతుణ్ణి విడిచిపెట్టమని వేడుకున్నాడు.
అయితే,
సత్యదీపుడు,” నువ్విలా వచ్చావంటే నీలో నిజంగానే మార్పు వచ్చిందని
అర్థం.కాబట్టి నిన్ను బంధించను. అయితే జయంతుణ్ణి మాత్రం మరి కొన్నాళ్ళు
ఇక్కడే బందీగా ఉంచక తప్పదు,” అన్నాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి,” రాజా,
అసలు దొషి అని తెలిసీ ప్రతీకుణ్ణి శిక్షించక వదిలి పెట్టడం; నిర్దోషి అని
తెలిసి కూడ జయంతుణ్ణి కారాగారంలో బంధించడం న్యాయాధి

కారి
సత్యదీపుడి విచక్షణా రాహిత్యాన్నీ, క్రూర స్వభావాన్నీ చాటుతున్నాయి కదా?
అలాంటి న్యాయాధికారిని పరోపకారి అని కొనియాడడం ప్రజల అఙ్ఞానం కాక మరేమిటి?
ఈ సందేహాలకు సమధానం తెలిసి కూడ చెప్పక పోయావో, నీ తల పగిలిపోతుంది,”
అన్నాడు.
దానికి విక్రమార్కుడు,”దోషులను కారాగారంలో బంధించడం, వారిలో
మంచిమార్పు తీసుకురావడానికే. అప్పటికే మంచివాడుగా మారిపోయిన ప్రతీకుణ్ణి
మళ్ళీ కారాగారానికి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఒరగదు. అందువల్లనే
న్యాయాధికారి అతన్ని వదిలిపెట్టాడు.ఇక జయంతుడి విషయం . అతడి పట్ల
న్యాయాధికారి క్రూరంగా వ్యవహరించలేదు సరికదా, గౌరవించి ఉపకారం చేశాడు.
పేరుకు కారాగారంలో బంధించినా, సమీరుణ్ణీ తోడుగా ఉంచి సకల సదుపాయాలూ
సమకూర్చాడు. జయంతుడి అపూర్వ వైద్యం గురించి చాటింపు వేయించాడు. జయంతుడి
వైద్యం కావాలంటే నేరస్థులు నేరం ఒప్పుకోవాలి.

అతడి వద్ద నేరాలు
ఒప్పుకున్నవాళ్ళ నేరాల గురించి, అతడికి తప్ప, మరెవ్వరికీ తెలియదు. వాళ్ళు
మళ్ళీ నేరాలు చేయరు. అటు నేరస్థులనిపించుకోకుండా, ఇటు శిక్షపడకుండా
నేరస్థుల్ని సంస్కరించే జయంతుడు కొన్నాళ్ళయినా సత్యపురానికి ఉపయోగపడాలనే,
న్యాయాధికారి అతన్ని బందీ చేశాడు. మరొక ముఖ్య విషయం ఏమంటే-తన జబ్బు
పూర్తిగా నయమయ్యేంత వరకు జయంతుడు తనవాళ్ళ మధ్య ఉండకూడదు అన్న నిబంధన
భంగమవకుండా అంతవరకు అతన్ని సత్యపురంలో ఉంచాలన్న సదుద్దేశంతొనే అతన్ని
బందీగా ఉంచాడు. అలా చేయడం ద్వారా రెండు మహత్తర ప్రయోజనాలను సాధించాడు. ఈ
కారణాల వల్ల ప్రజలు సత్యదీపుణ్ణి పరోపకారి అని కీర్తించడం అన్ని విధాలా
సమంజసమైనదే,” అన్నాడు.

రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెటెక్కాడు.

4 Responses to జయంతుడి వైద్యం

  1. cherry4u says:

    hi smart……very nice story….keep posting….

  2. hymavathy.Aduri says:

    Candamaama old stories are so nice to read in web Thanks.

Leave a reply to vasudevareddy స్పందనను రద్దుచేయి